POOJALU

logo

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానము,

ఇంద్రకీలాద్రి, విజయవాడ.

అమ్మవారి సేవా కార్యక్రమములు

ఉత్సవ విశేషములు – ఫలితములు

భగవంతునికి దేవాలయముల యందు ——

నిత్యోత్సవములు – వారోత్సవములు – పక్షోత్సవములు – మాసోత్సవములు – సంవత్సరోత్సవములు జరుపుట వలన లోకక్షేమము కలిగి సర్వదేవతా అనుగ్రహముతో రణబాధలు (శత్రు బాధలు) – రుణ బాధలు (అప్పుల బాధలు) – రోగ బాధలు – ఈతి బాధలు లేకుండా జనులందరు పశుపక్ష్యాదులతో సహా సకల ప్రాణికా 14 లోక వాసులు క్షేమము పొందుదురు.పంచ మహా భూతములు సక్రమమగు స్ధితిలో నుండి ఋతు ధర్మములను సక్రమముగ నడిపించుచు వాతావరణ సౌలభ్యము కలిగి పాడి పంటలు వర్ధిల్లి జనులందరు శాంతి సౌఖ్యములతో తులతూగుచుందురు. ప్రతి గృహము నిత్య కళ్యాణము – పచ్చతోరణముగా మంగళమయమై జనులందరు వంశాభివృద్ధి ఆయురభివృద్ధి కలిగి శతమానంభవతి శతాయుః ….. వేదములో చెప్పినట్లు పరస్పర ప్రేమాభిమానములతో శాంతి – సుభిక్షములతో సౌఖ్యానందములతో వర్ధిల్లుదురు.

ఖడ్గమాల

అమ్మవారి అర్చనకు ముఖ్యముగా మూడు భాగములు.

 1. లలితా సహస్ర నామము
 2. త్రిశతి
 3. ఖడ్గమాల

పై మూడు స్తోత్ర భాగములు  “ శ్రీదేవి “ అమ్మవారి యొక్క తత్వము – భక్తుల చరిత్ర – అమ్మవారి అనుగ్రహము – లోక రక్షణ – శ్రీదేవీ పూజా ప్రధాన విశేషములు – లోక రక్షణ భక్తులపై అమ్మవారి ఆశీః ప్రభావము – భక్తుల కర్తవ్యము మొదలగు విశేషములు తెల్పూచూ అమ్మవారి ‘ నామావళి ‘ నిండియున్నది. అందులో ఖడ్గమాలా స్తోత్రముతో – ప్రాతః కాల పూజ జరుపుట వలన భక్తులకు – ఆత్మ రక్షణ, రోగ నివారణ, కష్ట నివారణ, శత్రు బాధలు తొలుగుట ( శత్రువులు కూడా శత్రుత్వము వదిలి వేసి మిత్రులగుట) కామక్రోధాది అరిషడ్వర్గము అదుపులో నుండి తయోగుణ నివారణ కలిగి సత్వగుణము వర్ధిల్లి అఖండ విజయము సమకూరుట మొదలగు ఫలితములు కలుగును.

ముఖముగా భగవదనుగ్రహముతో  జనుల (భక్తుల) మనస్సు మంచి మార్గములో ప్రవర్తిల్లును.

స్వర్ణ పుష్పపూజ – ప్రతి గురువారము

‘’ స్వర్ణం పవిత్ర మమలం స్వర్ణం పాప ప్రణాశనమ్ ‘’

బంగారము శివ స్వరూపము, బంగారము పవిత్రతను సమకూర్చును. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన లోహము బంగారము అన్నింటిలోను శ్రేష్ఠమైనది బంగారము ఐశ్వర్యములలో అత్యుత్తమమైనది బంగారము.

కనుక (గురు) బహసృతి వారమున – (దేవతా గురువున అధిష్ఠానమగు రోజున) సువర్ణ పుష్పములతో అమ్మవారిని పూజించుట వలన అఖండ లక్ష్మీ కటాక్షము – అష్టైశ్వర్య  ప్రాప్తి కల్గును. మానసిక – శారీరక – వాచిక దోషములు తొలగి చిత్తశుద్ధి మనశ్శాంతి కలుగును.

పంచ హారతులు

 1. ఓం కార హారతి
 2. నాగ హారతి
 3. పంచ హారతి
 4. కుంభ హారతి
 5. నక్షత్ర హారతి

కర్పూర హారతి

 1. హారతి సమర్పణ వలన అమంగళములు తొలగిపోయి మంగళములు సమకూరును.
 2. హారతి సమర్పణ వలన అమ్మవారు – శివుడు (భగవంతుడు) సంతోషించి భక్తులకు ఆనందమును శుభమును ప్రసాదించును.
 3. పూజాంతములో హారతి సమర్పణ వలన ‘’ దిష్టి ’’ మొదలగు వ్యావహారిక దోషములు నివృతియగును.
 4. హారతి సమర్పణ వలన (తేజస్సును భగవంతునికి దర్శింపచేయుట వలన) భక్తులు తేజోవంతులై – విజ్ఞానవంతులై – కీర్తీ ప్రతిష్ఠలతో వెలుగొందుదురు.
 5. హారతి సమర్పణ వలన (ఆ సమయములో ఘంటానాదము – శంఖ ధ్వని) మొదలగు వాటి వలన భగవంతుడు సుప్రసన్నుడగును. భగవంతుని ఆశీస్సులు భక్తునిగా పూర్తిగా లభించును.
 6. హారతి సమర్పణ వలన సర్వాభీష్టములు నెరవేరును.
 7. హారతిని కళ్ళ కద్దుకొనుట చేత నేత్రగత – మనోగత – హృదయ గత దోషములు – కష్టములు తొలగిపోయి క్షేమము కలుగును.
 8. భక్తి ప్రపత్తులు వర్ధిల్లును.

విశేషాంశము

 1. ఓం కార హారతి – జ్ణాన ప్రదము – సింహ హారతి – శ్రీదేవి ప్రీతిపాత్రము – శత్రు బాధా నివారణ.
 2. నాగ హారతి – భాధా నివృత్తి – నంది హారతి – శివ ప్రీతికరము – మోక్ష ప్రదము.
 3. పంచ హారతి – పంచేంద్రియములు శుద్ధములగును. పంచ మహాభూతములు క్రమ బద్ధమైన క్షేమమును ప్రసాదించును.
 4. కుంభ హారతి – 14 లోకములలోని సకల ప్రాణి కోటికి సౌఖ్యము కలుగును.
 5. నక్షత్ర హారతి – నవగ్రహ దోష నివారణ – సర్వవిఘ్ననివారణ మనస్సంతోషదాయకము – మనస్సు సక్రమ మార్గములో ప్రవర్తించును.
 6. కర్పూర హారతి – ఆనందమును – శుభమును ఒసగును.

గోమాత పూజ

“మాత – గోమాత – భూమాత ‘’

పై ముగ్గురిని మాతృ శబ్ధంతో సంబోధించుట ఆచారమగు వస్తున్నది.

(తల్లిని – గోవును – భూమిని సేవించిన వానికి ప్రపంచములో ఎక్కడా లోటు ఉండదని పెద్దలు చెప్పుదురు)

 1. గోమాత దేహము నందు సమస్త దేవతలు బ్రహ్మ, విఘ్ణ, మహేశ్వరులతో సహా నిత్య నివాసము చేయుచుందురని శాస్త్ర ప్రమాణము.
 2. గోమాతను నిత్యము పూజించు వానిపై సర్వదేవతాను గ్రహముండును.
 3. గోమాతను పూజించినప్పుడు సర్వదేవతా పూజయగును.
 4. గోమాతను నిత్యము పూజించిన వానికి దరిద్రము తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించును.
 5. గోసేవ వలన ఈతి బాధలు తొలగి సమస్త క్షేమములు సమకూరును.
 6. నవగ్రహదోషములు – దోషసమయములో జన్మించినందు వలన కల్గిన దోషములు కూడా గోపూజ వలన తొలగిపోవును.
 7. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగును.

ఉయ్యాల సేవగంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఉయ్యాల సేవ

 1. శ్రీ స్వామి వారిని వేదమంత్ర పురస్సర ఆగమోక్త విధానముతో అర్చనా పూర్వకముగా ఉయ్యాల ఊపి స్వామి వారిని సేవించుట.
 2. ముఖ్యముగ వివాహార్ధులు, సంతానార్ధులు, వంశాభివృద్ధిని కోరువారలు ఈ సేవ జరిపించుకొని తమ అభీష్టములను స్వామి వార్ల అనుగ్రహముతో పొందుటకు వీలగును.
 3. అనేకములగు సేవలలో ఇది ఒక శ్రేష్ఠమగు సేవా కార్యక్రమము.
 4. ఈ సేవ చేత పార్వతీ పరమేశ్వరులను పరమానందభరితులను చేసి స్వామి వారి శుభాశీస్సులతో ఆనందోత్సాహములతో దంపతులు (కుటుంబీకులు) తులతూగుదురు.
 5. ఈ సేవ చేత ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి సంతానవృద్ధి, ఉద్యోగ లబ్ధి, ఆరోగ్యసిద్ధిని పొందవచ్చును.

శాంతి కళ్యాణము

 1. ఇది శుభమంగళములను ప్రసాదించు సేవ.
 2. ముఖ్యముగా వివాహము కావలసిన వారి కోసమై స్వామి వార్ల శాంతి కళ్యాణము జరిపించినచో 6 నెలల లోపల యోగ్యముగు సంబంధము నిశ్చయమై వధూవరులకు వివాహమగును.
 3. ఈతి బాధలు తొలగిపోయి సౌఖ్యానందనములు లభించును.
 4. దేవతలు మరియు పితృ దేవతల యొక్క అనుగ్రహము కలిగి గృహములో సంతానమునకు సకాలములో వివాహము జరిగి పరస్పర దాంపత్య అనుకూల్యత – వంశాభివృద్ధి కలుగును.

లక్ష కుంకుమార్చన

 1. అమ్మవారి నిత్య సేవలలో ఇది ఒక మహత్తరమైన సేవ సహస్రనామమును 100 పర్యాయములు పఠించుట వలన లక్ష సంఖ్య అగును. లక్ష అనునది శాస్త్రములో పరిపూర్ణ సంఖ్యగా చెప్పబడినది.
 2. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమయినది కుంకుమ. ఇది సంపూర్ణ సౌమంగల్య ద్రవ్యము
 3. లక్షకుంకుమార్చన చేయుట వలన అమ్మవారి అనుగ్రహముతో అన్ని కోరికలు నెరవేరును.
 4. భక్తులు సామాన్య కష్టములు – అతి క్రూరమైగు కష్టములు కూడా తొలగిపోయి శుభములను పొందుదురు.
 5. ఈ సేవ వలన శ్రీ దుర్గాదేవి (జగన్మాత) పరమానందభరితురాలై భక్తులకు సమస్త క్షేమములను స్త్రీలకు సౌమాంగల్యమును ప్రసాదించును.
 6. ముఖ్యముగా వివాహార్ధులు, ఉద్యోగార్ధులు, సంతానార్ధులు, ఆరోగ్యార్ధులు, స్వగృహార్ధులు, అధికారార్ధులు ఈ సేవను జరిపించినచో వెంటనే అమ్మవారి అనుగ్రహముతో తమ తమ అభీష్టములు నెరవేరి ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందగలరు.

శ్రీ చక్ర నవావరణార్చన

 1. అమ్మవారి నిత్య సేవలలో ఇది చాలా అనుగ్రహ ప్రదమైన సేవ.
 2. ఈ సేవ చేత (పూజా చేత) అనేకానేక దోషములు నివారణ అగును.
 3. కార్యక్రమములకు వివిధములైన విఘ్నములు – ప్రతిబంధకములు తొలిగిపోవును.
 4. కుటుంబ కలహములు – దాంపత్య కలహములు తొలిగిపోవును.
 5. ఉద్యోగ సిద్ధి – పదవీ ప్రాప్తి కలుగును.
 6. ఉద్యోగములో ఉన్నత స్ధానము లభించును.
 7. శత్రు బాధలు – గ్రహ దోషములు, భూత బాధలు తొలగును.

శ్రీ చక్రార్చన అంటే :-

సర్వపరి వారదేవతా సహిత పరమేశ్వరి (రాజరాజేశ్వరీ దేవి) యొక్క పూజా కార్యక్రమము.

చండీ హోమము

 1. అమ్మవారి యొక్క ఉత్సవ సేవా కార్యక్రమములలో చండీ సప్త శతీహోమము చాలా ప్రధానమయినది.
 2. ఈ చండీ హోమములో ప్రధాన దేవతలు
 3. మహాకాళిక 2. మహిషాసురమర్ధిని (మహ లక్ష్మీ దేవి) 3. మహా సరస్వతీ దేవి
 4. పై మూడు స్వరూపములతో అమ్మవారు మానవుల మనస్సులను సక్రమమయిన మార్గములో నడిపించి కామక్రోధాదులను అదుపులో ఉంచుతూ శత్రుబాధలను నివారించి విద్యాజ్ఞానములను ప్రసాదించును.
 5. చండీహోమము చేయుట వలన నవగ్రహ దోషములు తొలగిపోవును. జాతక దోషములు గోచారదోషములు తొలగిపోయి నవగ్రహముల ఆనుకూల్యత లభించును.
 6. కార్యక్రమములన్నియు నిరాటంకముగా కొనసాగి విజయము సమకూరును.
 7. విద్యాభివృద్ధి – వ్యాపార అభివృద్ధి – ఆరోగ్య సిద్ధి కలుగును.

పల్లకీ సేవ

 1. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారిని పల్లకిలో సేవించుట వలన శ్రీ స్వామి వార్ల అనుగ్రహముతో భక్తులకు మనస్సులో ఉన్న సంకోచములు – అశాంతి తొలగిపోయి కార్యక్రమ నిర్వహణ సామర్ధ్యము, కార్యనిర్వహణలో వేగము, ధైర్య  స్ధైర్యములు లభించును.
 2. సత్సంతాన ప్రాప్తి – వంశాభివృద్ధి కలుగును.
 3. ఉద్యోగములో ఉన్నత స్ధాయి వచ్చును.
 4. భగవద్భక్తి కలుగును, అనుకూల్యత కలుగును.
 5. భగవదపరాధ దోషములు కూడా తొలగిపోవును.

అమ్మవారి సహస్రనామార్చన

 1. అమ్మవారిని లలితా సహస్రనామముతో అర్చించుట ప్రాచీన సంప్రదాయము.
 2. లలితా సహస్రము మహా పుణ్యప్రదము.
 3. సహస్ర సంఖ్య పూర్ణ సంఖ్య కనుక అమ్మవారు సంతోషించి భక్తునికి అండగా నిలచి ముందుకు అభివృద్ధి మార్గములో నడిపించును.
 4. సహస్ర నామార్చన చేత అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యములు ధర్మార్ధ కామములు భక్తునికి ప్రసాదించును. విశేష శుభములను పొందుదురు.
 5. అన్ని విధములుగా భక్తులు క్షేమము పొందుదురు.
 6. స్త్రీలకు సౌమాంగల్యము వర్ధిల్లును.అమ్మవారి సహస్త్ర నామార్చనకోరికలు కోరుకోకుండా “ అమ్మవారు సంతోషించుగాక ’’ అనుభావముతో జరిపించుకొనుట విశేష శుభదాయకము.
 

అమ్మవారికి అష్టోత్తర నామార్చన

 1. అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని అష్టోత్తర నామములతో (108) పూజించుట సహజసేవ.
 2. తన దగ్గరకు వచ్చిన ప్రతి భక్తునిపై అమ్మవారి అనుగ్రహము కలుగును.
 3. ఏదైన నూతన ప్రారంభములకు ముందుగా అమ్మవారికి ఈ అర్చన చేసినచో ఆ కార్యక్రమములు విజయవంతముగా కొనసాగి క్షేమము, ఆర్ధిక లాభము కలుగును.
 4. అమ్మవారిపై భక్తి ప్రపత్తులు వర్ధిల్లును.

 శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల రుద్రాభిషేకం

 1. అభిషేకాత్ ఆత్మశుద్ధిః
 2. ప్రతి శుభకార్యము నందు మరియు అన్ని శాంతి కర్మలయందు మరియు అభీష్టములన్ని నెరవేరుటకు, కష్టములు తొలగిపోవుటకు కలహములు తొలగిపోయి శాంతి సౌఖ్యములు వర్ధిల్లుటకు రుద్రాభిషేకము చేయించవలెను.
 3. రుద్రాభిషేకముతో ఈతి భాదలు, నవగ్రహ దోషములు, అనారోగ్యములు, అప మృత్యువులు తొలగిపోయి అత్యంత శుభము కలుగును.
 4. దుఃఖములు తొలిగిపోవును.
 5. ఈశ్వరుడు పంచముఖుడు – ఐదుముఖములతో సుప్రసన్నుడై నిరంతరము రుద్రరూపములతో లోకమును కాపాడుచుండును.
 6. శివుడు ప్రసన్నుడైనచో అష్టైశ్వర్యములు లభించును. ఆయుష్యము వర్ధిల్లును. వ్యాపారములు విజయవంతములగును.

శ్రీ వల్లీ దేవ సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయములలో జరుపబడు సేవలుసర్పదోష నివారణ :

 1. ఈ పూజ వలన నాగదోషములు తొలిగిపోవుట
 2. సంతాన ప్రతి బంధకములు తొలిగిపోయి సత్సంతాన ప్రాప్తి కలుగును.
 3. దాంపత్య కలహములు తొలగిపోవును.
 4. బంధు మైత్రి నిరంతర అభివృద్ధి కలుగును.
 5. వెన్నుపూసకు సంబంధించిన అనారోగ్యములు తొలగిపోవును.
 6. కుటుంబములో సౌఖ్యనందములు కలుగును.సహస్ర నామ పూజ , అష్టొత్తర పూజ :ఈ పూజల వలన సహజమైన శుభ ఫలితములు కలుగును. నిత్యకృత్యములో నిర్విఘ్న కార్యక్రమ పరిసమాప్తి లభించును. స్వామి వార్ల అనుగ్రహము కలుగును. భగవద్భక్తి వర్ధిల్లును.

Comments are closed